మనం - మన సమితి

పిల్లల మర్రి హనుమంత రావు (An article written for the Silver Jubilee Issue, 1997-98)

ఆంధ్ర మహా సభకు దూరంగా ఉంటూ, దాదర్ కార్యక్రమాలకు దూరాభారం ఐన చెంబూరు చుట్టుపక్కలవున్న కాలనీ వారికి ఒక తెలుగు సంస్థ ఆవశ్యకత చాలాసంవత్సరాలనించీ ఉంది. ఈ ప్రయత్నం లో భాగం గానే 1970 సంవత్సరాల కాలంలో చెంబూరులో కొందరు ఔత్సాహికులు శ్రీరామ నవమి ని జరుపుకొన్నారు. ఆ తర్వాత అణుశక్తి విభాగం లో పనిచేస్తున్న కొందరు, తెలుగు శాస్త్ర సాహిత్యం పెంచే ఉద్దేశ్యం తో కొన్ని సమావేశాలు జరుపుకొన్నారు గాని, ఈ ప్రయత్నాలన్నింటికీ ఒక నిర్దుష్ట రూపం ఏర్పడ లేదు!

1972 సంవత్సరం సంక్రాంతి నాడు, శ్రీమతి జయదేవి గారి నిర్వహణలో పండుగ వేడుకలు, 'ఇద్దరమ్మాయిలు' సినిమా ప్రదర్శన నిర్వహించటం జరిగింది. ఈకార్యక్రమాలు నాందిగా ఆసంవత్సరం కొన్ని నాటక ప్రదర్శనలు, పిల్లల కార్యక్రమాలు, ఒకటి రెండు సినిమా ప్రదర్శనలు ఆ ఏడాది నిర్వహించాము. ఈ కార్యక్రామలన్నిటికి, అణుశక్తినగర్, చెంబూర్, RCF కాలనీ లలో నివసిస్తున్న తెలుగు కుటుంబాలవారు రావటం మాత్రమే కాకుండా కార్యకర్తలను కూడా ప్రోత్సహించారు. ఏ కార్యక్రమానికి కావలసిన డబ్బు ఆరోజు కలెక్టు చేసుకోవటం జరిగింది కాని, ఒక సంస్థ గా ఆఏడాది ఏర్పాటు చేసుకోలేదు.

ఈ ప్రోత్సాహాన్ని పునాది గా చేసుకొని 1973 వ సంవత్సరం లో శ్రీ ప్రయాగ గారి సహాయం తో, శ్రీ మోహన రావు, శ్రీ హరప్రకాష్ వంటి సభ్యులు constitution రాసుకొని, తెలుగు సాహిత్య సమితి అని పీరు పెట్టుకొని ఏర్పాటు చేసుకొన్న మొట్టమొదటి సర్వసభ్య సమావేశం లో శ్రీ వెంకటేశ్వర్లు అధ్యక్షతన, నేనుకార్యదర్శి గా   మొట్టమొదటి కార్య వర్గం ఎన్నికయ్యింది. 1974 లో కొంత బ్రాడ్ బేస్ చేసుకొని శ్రీ కృష్ణా రావు అధ్యక్షతన, శ్రీ హరప్రక్యాస్ కార్యదర్శి గా కొత్త కమిటీ ఎన్నికయ్యింది. ఈసంవత్సరం మొదటి సారి శ్రీరామనవమి పెద్ద యెత్తున మూడురోజులు జరుపుకొన్నారు. శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాట కచేరీ - మద్రాసు నించి శ్రీ రావికొండలరావు ట్రూపు "ప్రొఫెసర్ పరబ్రహ్మం" నాటక ప్రదర్శన, కుమారి సుభద భారత నాట్య ప్రదర్శన ఈ మూడురోజుల కార్యక్రమాలు. ఈ కార్యక్రమాల నిర్వహణ లో మన బొంబాయి సాంస్కృతిక రంగం లో తెలుగు సాహిత్య సమితి ప్రోగ్రాములకొక ప్రత్యేక స్థానం వచ్చింది. ఈప్రత్యేకతను, ఈనాటికీ తెలుగువారు గుర్తిస్తారు.

ఒక వంక పెద్ద ఎత్తు ప్రొఫెషనల్ ఆర్టిస్టులచే కార్యక్రమాలు నిర్వహిస్తూ, మరొకవంక సభ్యులు, వారి పిల్లలు కలసి పాల్గొనే కార్యక్రమాలు కూడా నిర్దిష్టంగా, ఆకర్షణీయంగా చెయ్యాలనేపట్టుదలతో, 1975-77 సంవత్సరాల మధ్య గట్టి కృషి జరిగింది.

ఈకోవకు చెందిన కార్యక్రమాలు, సీరియస్ సోషల్ డ్రామా, 'యథా ప్రజా తథా రాజా', ఆంగ్ల రచయిత వుడ్ హవుస్ రచన ఆధారంగా సభ్యులచే రాసి ప్రదర్శించిన హాస్య నాటకం 'అపరాధ గోపాలీయం' ప్రేక్షకులను ఆకట్టుకొని హవుస్ ఫుల్ తో ఆదరించారు. కుమారి భవాని వంటి సభ్యులచే భరతనాట్య ప్రదర్శనలు, శ్రీ కొడవటిగంటి రోహిణీప్రసాద్ నిర్వహించే తెలుగు పాటల కార్యక్రమాలు ఈ పీరియడ్ లోనే ఒక నిర్దిష్ట రూపాన్ని ఏర్పాటు చేసుకొన్నాయి.

మూడుగంటల పరిధి ఉన్న ఈప్రతి కార్యక్రమం (నాటకాలు గాని, భరతనాట్యం గాని, సినిమా పాటల కార్యక్రమం గాని) ప్రొఫెషనల్ గా తీర్చి దిద్దిన ఘనత తెలుగు సాహిత్య సమితిదే. ఈ పీరియడ్ లో పరాకాష్ట గా ఎంచదగిన కార్యక్రమం - శ్రీ గురజాడ అప్పారావుగారు రచించిన గేయ రూపకం 'పుత్తడి బొమ్మ పూర్ణమ్మ'. శ్రీ రాయనం ప్రసాద్ స్వర కల్పన, శ్రీమతి ఉషా కృష్ణా రావు గారు రూపకల్పన చేసిన ఈకార్యక్రమంలో స్టేజి మీద పాల్గొన్న కళాకారులందరూ పది సంవత్సరాల లోపు పిల్లలే. అంత ఉదాత్త మైన రూపకాన్ని చూసి కంట తడి పెట్టని ప్రేక్షకుడు లేడు ఆరోజు.

ఈసంవత్సరం లో స్వర్గీయులైన శ్రీ చట్టి హనుమంతరావు గారిల్లు మన తెలుగు సాహిత్య సమితి అఫీషియల్ హెడ్ఆఫీసే కాక - మన కార్యకర్త లందరికీ విడిది లాంటిది. ఆతర్వాత శ్రీ V.S. రంగారావు గారి ప్రాంగణం మన తెలుగు సాహిత్య సమితి ఆఫీస్. వీరిద్దరిఆనాటి ఆతిధ్యానికి మన కృతజ్ఞతాపూర్వక నమస్కృతులు.

తెలుగు సాహిత్య సమితి 25 సంవత్ర్సరాల చరిత్ర లో, స్వర్నయుగమని పేర్కొనదగిన సంవత్సరం 1977-78. స్వర్గీయులు R. V. Rao గారు అధ్యక్షులు, శ్రీ L. V. Rao గారు కార్యదర్శి. సినిమాహాళ్లలో సినిమాలు ప్రదర్శించుటే కాక, వివిధ కార్యక్రమాలు నిరాఘాటంగా నిర్వహించారు. సభ్యులచే 'కుమార సంభవం' ప్రదర్శన, శ్రీ గురు వెంకట చిన సత్యం గారి ట్రూప్ తో 'పద్మావతి శ్రీనివాసం' ప్రధమం గా బొంబాయి లో ప్రదర్శన, ఆంధ్రలో దివిసీమ లో సమితి నిర్వహించిన తుఫాన్ భాదితుల సహాయం, ముఖ్యంగా ఎన్న దాగిన మూడుకార్యక్రమాలు.

పూర్తిగా సభ్యుల టాలెంట్ తో ప్రదర్శించిన 'కుమార సంభవం' డాన్సు డ్రామా పండితులు, పామరుల ప్రసంసలు అందుకొంది. ఈ డ్రామా వ్రాసి డైరెక్ట్ చేసినవారు డా. ఏ.వి.మురళి, స్వరకల్పన శ్రీ రోహిణీ ప్రసాద్, రూపకల్పన శ్రీమతి ఉషా కృష్ణారావు.

గురు చిన సత్యం గారు నిర్వహించిన ప్రత్యేక నాట్య కార్యక్రమం 'పద్మావతి శ్రీ నివాసం'. కార్యక్రమం ప్రదర్శించటానికి మొదటి సారిగా ఏ పెద్ద సంస్థా ముందుకు రాలేదు. తెలుగు సాహిత్య సమితి కి గురువు గారిమీద గౌరవం - గురువు గారికి మనమీద ఉన్న అభిమానం పురస్కరించుకుని షన్ముఖానందా హాలులో సమితి ఈకార్యక్రమాన్ని ప్రప్రధమం గా బొంబాయిలో నిర్వహించింది. ప్రదర్శన చూచి నెల లోపుగానే పది సంస్థలు గురువు గారిని ఆహ్వానించాయి.

1977 వ సంవత్సరం ఆంధ్ర దివిసీమ లో వచ్చిన తుఫాను కి తెలుగు సాహిత్య సమితి కదలి పోయింది. నేను కన్వీనర్ గా సైక్లోను ఫండు ఏర్పాటు చేసి చక చకా వస్తురూపేణా - డబ్బు రూపం లో చందాలు ఇతోధికంగా కలక్టు చేసాము. ఈకార్యక్రమం లో శ్రీ రంగారావు గారి కృషి మాకెంతో ఉపకరించింది. ఆరు టన్నుల బరువు గుడ్డలు బొంబాయిలో సేకరించి - వాటిని దివిసీమలో లారీలో డైరెక్టు గా బాధితులకు పంచింది - సమితి. దివిసీమ లో ఏనుపురం లో అందరికి నివాసాలు కట్టించింది.

ఈపనులకు నేను, D.S. మురళి ధర్రావుగారు నెల రోజులు దివిసీమలో మకాం ఉన్నాం. ఆసంవత్సరం శ్రీ D. మురళి సావనీర్ కమిటీ కన్వీనర్ గా ఉండి, సమితి కి ఇతోధికంగా ఫండ్స్ కలక్ట్ చెయ్యడమే కాక, సైక్లోను రిలీఫ్ ఫండ్ అత్యధికంగా కలెక్ట్ చేసిన ఘనత కూడా వారిదే.

1979 వ సంవత్సరం లో రాజేశ్వరరావు నైట్ ఒక లాండ్ మార్క్. షన్ముఖానందా హాలులో జరిగిన ఆకార్యక్రమం లో హాలు నిండి పోవడమేకాక టికెట్లు దొరకని జనం తో అక్కడ రోడ్లు నిండి పోయాయి.

1986 వ సంవత్సరం లో ఇతర పెద్ద సంస్థ తో తెలుగు సాహిత్య సమితి ని కలపాలనుకొన్న పెద్ద సంల్పానికి భిన్నంగా శ్రీ డి. మురళి, శ్రీ కృష్ణ శర్మ. విడిగా నిలబెట్టాలనే ఉద్దేశ్యం తో శ్రీ కృష్ణ శర్మ అధ్యక్షులూ, ఓ. సుబ్రహ్మణ్యం కార్యదర్శి గా కమిటీ ఎన్నుకొన్నారు. ఆసంవత్సరం జరిగిన ఒక కొత్త ప్రయోగం - శ్రీ చంద్ర మోహన్, తాళ్ళూరి రామేశ్వరి వంటి ప్రముఖ సినిమా తారలతో కలసి మన సభ్యులు శ్రీ రాజగోపాలరావు, శ్రీమతి భానుమతి తదితరులు ప్రద్శించిన నాటిక ప్రదర్శన. శ్రీ గోవిందాచారి నిర్వహణలో మరొక నాటిక. ఈరెండు నాటికల ప్రదర్శన తో షణ్ముఖా హాలు నిండిపోయింది. ఈసంవత్సరమే తెలుగు సాహిత్యసమితి చెంబూరు లో ఆఫీసు కొనుక్కోవటం జరిగింది.

1994 వ సంవత్సరం లో పునరుద్దీపన చెయ్యాలనే సంకల్పం తో శ్రీ B. R. రావు గారి అధ్యక్షతన నేను కార్యదర్శి గా ఎన్నికైన కమిటీ తర్వాత మూడుసంవత్సరాలూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించటమే కాకుండా, ఆర్ధికంగా సమితిని పటిష్టం చేసింది. ఛైర్మన్ గా శ్రీ డి. మురళి, ట్రస్టీ గా శ్రీ సీతారామయ్య గార్ల కృషి ఎంతొ ప్రసంశ నీయమైనది. ఈమూడు సంవత్సరాలలో శ్రీ రామనవమి కార్యక్రమాలలో భక్తులు చాలామంది పాల్గొన్నారు. ముఖ్యంగా పేర్కొనవలసిన కార్యక్రమాలు వేణుమాధవ్ మిమిక్రీ, గురు వెంపటి చిన సత్యం ట్రూపు క్షీరసాగర మధనం, సంపత్కుమార్ జాలరి ముత్యాలు, మీనాక్షీ శేషాద్రి భారత నాట్యం, మహారాష్ట్ర, ఆంధ్రుల మధ్య సాంస్కృతిక సంబంధాలు - సెమినార్. సమితి సొంత ఆఫీస్ లో అద్దెకున్న టెనేన్ట్ - కోర్టులో కేసు పెట్టి మన ఆఫీసు ని కబళిద్దామని ప్రయత్నించినా అతన్ని కోర్టు ద్వారా ఖాళీ చేయించి మన ఆఫీసు మనం పొందటం చాలా సంతోషకారణం. ఈవిషయం లో శ్రీ ఆకెళ్ళ సుబ్రమణ్యం గారి కృషి ని మనం గుర్తుంచుకోవాలి. శ్రీ సీతారామయ్య గారి అధ్యక్షతన సమితి ఇంకా ఎంతో అభివృద్ధి ని పొండుతుందని ఆశిద్దాము.